Friday, August 3, 2012

శివానందామృత తరంగం - 2


శివానందామృత తరంగం - 2
(31వ శ్లోకం నుండి 50వ శ్లోకం వఱకు)
            శంకర భగవత్పాదులు మానవాళికి అందించిన అపార ఆధ్యాత్మిక భాండాగారంలోని వన్నీ వజ్ర వైఢూర్యాలే, మణిమాణిక్యాలే, మేలిముత్యాలే.  భగవత్పాదుల ఆధ్యాత్మిక భావసుధా జలధిలో శివానందలహరి ఒకానొక ఉత్తుంగతరంగం.  ఆ ఆనందాంబుధిలో మునకలేసే భాగ్యం ఆ పరమేశ్వరానుగ్రహం వల్ల కలిగింది.  భగవంతుని దివ్య విభూతలను కీర్తించడంతో పాటుగా, ఆ దేవదేవునితో మనకున్న సన్నిహితత్త్వాన్ని, బాంధవ్యాన్ని, ప్రేమానురాగాలని ఎరుకపరుస్తూ భగవత్పాదులు అమృతగానం చేశారు. 
       నేనా జ్ఞానంలేని పశువుని, నీవా పశుపతివి కాబట్టి నన్ను రక్షించడం నీ బాధ్యత అని పరమేశ్వరునికే కర్తవ్యాన్నికొంటెగా గుర్తుచేస్తారు.  ఏ జన్మైతేనేం, ఏ ఆశ్రమమైతేనేం, శివా నీ ఆరాధనలో నిమగ్నమయ్యేలా అనుగ్రహించమంటారు. నీవా దీనబాంధవుడివి, నేనాదీనులలో ప్రధముడిని, అనుగ్రహించేందుకు ఇంకేం అర్హత కావాలంటూ గడుసుగా ప్రశ్నిస్తారు. నీకోసం నిర్మల మానస సౌధం నిర్మించా, శక్తిమేరకు సేవించుకుంటా నివసించమంటూ పరమాత్మను ఆహ్వానిస్తారు. దేవతా పరివేష్ఠితుడైన స్వామి దర్శనం, ఆ ఆనందానుభవం ఎప్పుడా అని ఆర్తిగా అర్ధిస్తారు.
       భగవత్పాదులకా ఈ అవసరం?  కాదు, భవబంధాలలో మునిగి, ఆ పరమాత్మవైపు మనసు తిప్పని నా వంటివారికోసమే, శంకరులు తమ కారుణ్యామృతాన్ని శివానందలహరి స్తోత్రంద్వారా వర్షించారు.  ఆ భావ సౌరభాలు నన్నెంతో ఆకర్షించాయి.  నా సౌలభ్యం కోసం, నా మదిలో వాటిని  సుస్ధిరంగా నిలుపుకొనేందుకు, నే చేస్తున్న ప్రయత్నమే, ఈ స్వేచ్ఛానువాద పరంపర.  వీలయినంత త్వరగా అన్ని శ్లోకాలనూ పరమేశ్వరానుగ్రహంతో పూర్తిచేయాలని కోరిక.  ఎప్పటికప్పుడు, ఈ అనువాద పరంపర, పాఠకులకు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తాను.  పాఠకులు తమ అభిప్రాయాలు తెలియచేయవలసినదిగా కోరుతున్నాను.

31. హాలా హలం
            భయంకర జ్వాలావహం
            దివిజులంతా పలాయనం
      అయినా,
            నిక్షిప్తం నీ కంఠాన్నే
      బాహ్యంలో దేవగణాలు
      ఉదరంలో చరాచర భూతగణాలు
      సర్వం క్షేమం నీ కరుణతోనే
      ఇంతకుమించిన మహోపకారమేదీ
            ముజ్జగాలకూ
32. గరళం
          మహోగ్రజ్వాలలతో
            అమరులభయహేతువై
            ఎలా కనబడింది నీ కది ?
      మారేడు ఫలమా!
            చేతనుంచుకొన్నావు
      సిద్ధౌషధమా!
            నోటిలో వేసుకొన్నావు
      నీలమణియా!
            కంఠాన ధరించావు
33. ఒకే ఒక్కసారి నిను
            నమస్కరించి నంతనే
            స్తుతించి నంతనే
            పూజించి నంతనే
            స్మరణ మాత్రాన్నే
            దివ్యలీలా శ్రవణంతోనే
            రూప దర్శనమాత్రాన్నే
      ముక్తి సౌలభ్యం, మహేశా!
      స్థిరంకాని దేవతారాధనం
            ఏం ప్రయోజనం!

34. సర్వ ప్రపంచం లయమౌతోంటే
      దేవగణాలన్నీ నశిస్తోంటే
      మునిగణాలన్నీ భీతావహమౌతోంటే
      నీ ఒక్కనివే
      నిర్భయంగా చూస్తూ
      ఆనందాంబుధిలో విహరిస్తూ
      ఆహా! పశుపతీ! భూతనాథా!
      శక్యమా! వర్ణింప నీ సాహసం
      సాధ్యమా! ఇతరులకు నీ ధీరత్వం

35.    సర్వశ్రేయ ప్రదాతా!
            యోగక్షేమం వహించడంలో ప్రతిభ నీదే
      ఇహపరసాధనోపదేశికా! సర్వవ్యాపకా!
      సర్వజ్ఞా! దయాకరా!
      నీకెలా విన్నవించుకోవడం?
      శంభో!”,  పరమాంతరంగా!”
      అంటూ చిత్తంలో స్మరించుకోవడం తప్ప

36. ప్రశాంత మానస కలశాన్ని
      భక్తిభావాల
            పసుపుదారాలతో చుట్టి
      సంతోష జలాలతో పూరించి
      నీ పాదపద్మ చిగురులపై
            నారికేళ జ్ఞాన ఫలాన్నుంచి
      శాంతి మంత్రోచ్ఛారణలతో
            పుణ్యాహవాచనం చేసి
      శరీరాన్ని శుధ్ధిపరచుకోనీ సదాశివా!

37. మంథరమనే మనస్సుని
            దృఢభక్తియనే తాడుతో బంధించి
            వేద సంద్రాన్ని మథిస్తే
            నీ అనుగ్రహంవల్లనే కదా లభ్యం
             చంద్రుడూ, కల్పతరువూ,
            కామధేనువూ, చింతామణీ
             నిత్యానందాన్నిచ్చే అమృతమూ
            నిరంతర లక్ష్మీసౌభాగ్యమున్నూ
 
38.  పూర్వపుణ్యపర్వతంపైని
            మార్గదర్శకా అమృతమూర్తీ
      ఉమా సమేతా, సద్గణ పరివేష్టితా
            మృగధరా, మంగళ ప్రసన్నమా
      అజ్ఞానాంధకార విముక్తి ప్రదాతా,
           ఆనంద పాథోనిథీ,
      నీ దర్శన సౌభాగ్యమాత్రాన్న
            విజృంభించే చిత్తవృత్తులిక పుట్టులేనివే

39.   నాల్గుపాదాల నడుస్తుంది ధర్మం
      పాపాలు, కామక్రోధమదాదులు నశిస్తాయి
      అన్నికాలాలలో సుఖమువెల్లివిరుస్తుంది
      అనంత జ్ఞాన ఔషధీ సేవనం సత్ఫలితాలిస్తుంది
      కైవల్యనాథుడు నా మానసపుండరీకంలో
      మహరాజులా సదా కొలువుతీరినప్పుడు    

40. బుద్ధి యంత్రమై
      వాక్కనే కుండతో
      కవిత్వమనే పిల్లకాలువనుండి
      తేబడిన
           పరమేశచరితామృత సాగరం నీరు
           నా హృదయసీమలో భక్తిపంట పండిస్తోంది
           సత్ఫలితాలిస్తోంది
           నీ సేవలో
          ఇక దుర్భిక్షమనే భయమెక్కడిది
           శంకరా!


41.  పాప వినాశనా! మృత్యుంజయా!
      నిన్ను నుతించడంలో
                  నా జిహ్వను
      నీ ధ్యానంలో నిమగ్నమయ్యేలా
                  నా మనసును
      నీ పాదాబ్జాలకు మొక్కడంలో
                  నా శిరస్సును
      నీ ప్రదక్షిణ చేయడంలో
                  నా పాదాలను
      నీ అర్చన చేయడంలో
                  నా హస్తాలను
      నిన్ను దర్శించడంలో
                  నా నేత్రాలను
      నియతించు ప్రభూ!
                  శిరసావహించేలా ప్రేరేపించు

42. గాంభీరత్వమే
                  లోతైన కందకంగానూ
      ధీరత్వమై
                  ఉన్నత ప్రాకారంగా
      సద్గుణములే
                  విశ్వాసనీయ రక్షకులుగా
      సంయమిత ఇంద్రియాలే
                  ప్రవేశద్వారాలుగా
      పరమ వేద విజ్ఞానమే
                  సకల సంపదా విశేషంగా
      నిర్మించుకొన్న నా మనోదుర్గంలో
                  సదా వసించు ప్రభూ! దుర్గ ప్రియా !

43.  ఓ ఆది కిరాతా
                  నాలో నివసించు
వేటకై పర్వతాలపై పరిభ్రమించకు
      నా మానస మహారణ్యంలో
                  మోహమూ, మాత్సర్యాదులనే
                  మదించిన క్రూర మృగాలెన్నో
      వేటాడి, వధించి
                  మృగయా వినోదం తీర్చుకో
44.  హరిణముచేబూనిన వాడు
      గజాసుర భంజకుడు
      వ్యాఘ్రాసుర సంహారి
      జంతుకోటిని ఉదరాన వహించినవాడు
      తెల్లని మేనికాంతివాడు
      పంచముఖుడు, గిరీశుడు
      నా మనోకుహరంలో ఉండగా                
      భీతి ఎక్కడ

 45.  ఓ మానస పక్షిరాజమా
                  వృథా సంచారం వదిలేయి
      శాశ్వత సౌఖ్యప్రదాయమై
      దుఃఖతాప నివారణమై
      అమృతపూర ఫలాలచే శోభిల్లే
      దేవతలచే సేవింపబడుతూ
వేద శాఖల శిఖరాగ్రాన నున్న
      శంకర పాదపద్మయుగళీ గుహలో విహరించు
46.  కొనగోటి కాంతుల వైభవంలో
      నిండుగా పద్మరాగాలతో
      సోమామృతకిరణ వర్షధారలతో
      జ్ఞాన హంసల ఆశ్రయమై
      గిరిజాధీశుని సౌధాంతర్గతమైన
      అద్భుత సరోవరంలో
      భక్తి వధూ సమేతంగా
      స్వేచ్ఛా విహారం చేయి
      ఓ మానస రాజహంసమా !

47.  శివా నీ ధ్యాన వసంతం
      ఎద పూతోటలో ప్రవేశింపగానే
      పాపపు ఎండుటాకులు పతనమైపోయాయి
      పుణ్య పల్లవాలు మొలకెత్తి
                  భక్తి లతలు చిగురించాయి
      వాచిక జప కుసుమాలు వికసించి
                  సత్కర్మ సువానలు వెదజల్లుతూ
                  జ్ఞానామృత మకరందాలు స్రవిస్తూ
                  బ్రహ్మజ్ఞాన ఫలాన్నందిస్తున్నాయి
 
48.  కల్మష ప్రవాహాల వృథా విహారమెందుకు ?
      సుర మునిగణాల హృద్కమలాల ఆశ్రయం
      నిర్మలమూ, సాధుసజ్జన సేవితమూ
      సత్కర్మవాసనా విష్కృతమూ,
నిష్కలంకమూ, సుస్థీరమూ
నిత్యానందామృత పాత్రమౌ
సదాశివధ్యాన సరసులో
ఓలలాడవే
ఓ మానస రాజహంసమా !
49.  ఆనందసుధా నీరంతో
      సదాశివ పాదపద్మాల పాదులో పుట్టి
      చిత్తస్థైర్యమనే ప్రాకుడు కంప ఆథారంగా
            శాఖోపశాఖలుగా విస్తరించి
      ఉన్నత మానసపందిరిని ఆక్రమించి
      నిష్కల్మషమూ, సత్కర్మ వర్థితమూనై
      ఈ భక్తి లత
      నాకు శాశ్వతాభీష్ట ఫలాన్ని ప్రసాదించు గాక
50.  సంధ్యారంభంలో విజృంభించేదీ
             వేద శీర్షాలైన ఉపనిషత్తులలో వర్ణింపబడినదీ
భ్రమరాంబాదేవి ప్రేమామోదమైనదీ
ఎల్లవేళలా సాధు సజ్జన సేవితమైనదీ
సర్ప భూషణాలంకృతమైనదీ
       సర్వ దేవతలచే పూజింపబడునదీ
సద్గుణాలచే ఆవిష్కరింపబడునదీ
సర్వదా    అమ్మ చే ఆలింగితమైన
                        శ్రీశైల మల్లిఖార్జున మహాలింగమే
                        సదా సేవ్యమానం.